బాబ్రీ కూల్చివేత కేసులో 19 మందికి నోటీసులు : సుప్రీంకోర్టు

1992లో బాబ్రీ మసీదును విధ్వంసం చేయాలని బిజెపి సీనియర్ నేతలు మురళీమనోహర్ జోషి,లాల్ కిషన్ అద్వానీ, శివసేన చీఫ్ బాల్ థాక్రే కుట్రపన్నినందుకు సుప్రీంకోర్టు శుక్రవారం మరో 19 మందికి నోటీసులు జారీ చేసింది. ఆరోపణల పునరుద్ధరణకు అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టుకు పిటిషన్ సమర్పించటంతో కోర్టు వారి వైఖరి ఏమిటో తెలియజేయాలని నోటీసులు పంపింది. జస్టిస్ వి.ఎస్.సిర్‌పుర్కార్, జస్టిస్ టి.ఎస్.ఠాకూర్‌లతో కూడిన ధర్మాసనం తమ నోటీసులకు నాలుగువారాలలో సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

నిందితులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు ఉపసంహరించుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. అలహాబాద్ హైకోర్టు చేసిన ఆదేశాలను సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పు వెలువడిన 90 రోజుల్లోగానే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. హైకోర్టు నిరుడు మే 20వ తేదీన తీర్పు వెలువరించింది. మసీదు విధ్వంసానికి సంబంధించి బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్‌పి, అగ్రనేతలు అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, వినయ్ కటియార్, విష్ణుహరి దాల్మియా, సాధ్వీ రితంభర, మహంత్ అవైద్యనాథ్‌లపై కేసు పునరుద్ధరణకు సిబిఐ సుప్రీంకోర్టు అనుమతి కోరింది.

సిబిఐ రివిజన్ పిటిషన్‌లో పస లేదని అలహాబాద్ హైకోర్టు 2001 మే 4న ఇచ్చిన తీర్పులో పేర్కొంది. దాంతో నిందితులైన అగ్రనేతలను నిర్దోషులుగా వదిలేశారు. కాని వారు దోషులేనని అందువల్ల తిరిగి వారిపై నేరారోపణ చేసేందుకు అనుమతించాలని సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారించిన సుప్రీం నిందితులకు నోటీసులు పంపింది.

Leave a Comment