ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఉక్కు కర్మాగారం ఒరిస్సాలో: నవీన్ జిందాల్

భువనేశ్వర్ అర్బన్ – న్యూస్‌టుడే: ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఒరిస్సాలో వచ్చే పదేళ్ల కాలంలో ఏర్పాటు చేస్తామని జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్‌పీఎల్) ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ జిందాల్ ప్రకటించారు. శనివారం ఇక్కడ సచివాలయంలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆయన సమావేశమయ్యారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ, అనుగుల్‌లో తమ కంపెనీ నిర్మిస్తున్న స్టీల్ ప్లాంటు తొలి దశ 2012 మార్చి నాటికి పూర్తి అయ్యి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని తెలిపారు. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) ఉంటుందని, 2013కల్లా ఈ సామర్థ్యాన్ని 6 ఎంటీపీఏకు విస్తరిస్తామని నవీన్ జిందాల్ చెప్పారు. ఆపై ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 20 ఎంటీపీఏకు పెంచుతామని, అపుడు ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచంలో ఈ ప్లాంటు అతి పెద్దదిగా నిలుస్తుందన్నారు. ఉక్కు కర్మాగారంతో పాటు బొగ్గు నుంచి ఇంధన ఉత్పత్తికి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 4 మిలియన్ టన్నుల బొగ్గును సంస్కరించి రోజుకు 8 వేల బ్యారెళ్ల ఇంధనం ఉత్పత్తి చేస్తామన్నారు. రానున్న పదేళ్లలో తమ కంపెనీ సుమారు రూ.1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని నవీన్ వివరించారు. ప్రస్తుతం ప్రతిపాదిత కంపెనీల్లో పోస్కో, యార్సెలర్ మిట్టల్ కంపెనీలు 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తాయని, రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 3ఎంటీపీఏ, టాటా సంస్థ 6 మి. టన్నులు ఉక్కు ఉత్పత్తి చేస్తున్నాయని నవీన్ చెప్పారు.

Leave a Comment